నేపథ్యం 1970 దశకం లో మన ఊర్లో అంటే దొరలున్న జమాన్లో దాదాపు ఏ సంఘాలు లేవు కాని అప్పిటికి కాస్తో కూస్తో విద్యావంతులుగా ఉన్న గోల్కొండ సీతారాం, శ్రీ పెరంబుదూరి విద్యాసాగర్, చట్లపెల్లి చిన్ననర్సయ్య - పెద్ద నర్సయ్యలు, ద్యావతి ముత్తన్న, టెక్స్ నర్సయ్య , అంకతి పెద్దరాజన్న మొదలగు వాళ్ళు వాళ్ళ అవగాహన మేరకు "శాస్త్రి యువజన సంఘం " పేరు తో యువజన సంఘాన్ని ఏర్పరచుకున్నారు. ఆ సంఘం ద్వారా గ్రామం లో అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాలు చేయాలని సంకల్పించారు. ఒక నిబద్దతతో క్రమశిక్షణతో వారు సంఘాన్ని నడిపారు. ప్రతీ మాసం క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకుని గ్రామ పరిస్థుతుల గురించి ఆలోచించేవారు . ప్రజల్లో అవగాహన పెంచేదానికి చిన్న చిన్న నాటికలను వేసేవారు. స్వయంగా విద్యాసాగర్ గారు రచయిత కళాకారుడు అవడం చేత నాటకాలు రచించి దర్శకత్వ భాద్యతలను నిర్వహించే వారు. అలా వారు వేసిన " తాగు బోతు " అనే నాటికను ఇప్పటికి మన గ్రామస్తులు యాజ్జేసుకుంటారు . ఆ నాటిక లో తాగడం వల్ల అనర్ధాలను తెలియజెప్పారు. ...