నవ శాస్త్రి యువజన సంఘం

  నేపథ్యం 


                  1970  దశకం లో మన ఊర్లో అంటే దొరలున్న జమాన్లో దాదాపు ఏ సంఘాలు లేవు కాని అప్పిటికి కాస్తో కూస్తో విద్యావంతులుగా ఉన్న గోల్కొండ సీతారాం, శ్రీ పెరంబుదూరి విద్యాసాగర్, చట్లపెల్లి చిన్ననర్సయ్య - పెద్ద నర్సయ్యలు, ద్యావతి ముత్తన్న, టెక్స్ నర్సయ్య , అంకతి పెద్దరాజన్న మొదలగు వాళ్ళు వాళ్ళ అవగాహన మేరకు "శాస్త్రి యువజన సంఘం " పేరు తో యువజన సంఘాన్ని ఏర్పరచుకున్నారు. ఆ సంఘం ద్వారా గ్రామం లో అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాలు చేయాలని సంకల్పించారు. ఒక నిబద్దతతో క్రమశిక్షణతో వారు సంఘాన్ని నడిపారు. ప్రతీ మాసం క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకుని గ్రామ పరిస్థుతుల గురించి ఆలోచించేవారు . ప్రజల్లో అవగాహన పెంచేదానికి చిన్న చిన్న నాటికలను వేసేవారు. స్వయంగా విద్యాసాగర్ గారు రచయిత కళాకారుడు అవడం చేత నాటకాలు రచించి దర్శకత్వ భాద్యతలను నిర్వహించే వారు. అలా వారు వేసిన " తాగు బోతు " అనే నాటికను ఇప్పటికి మన గ్రామస్తులు యాజ్జేసుకుంటారు .  ఆ నాటిక లో తాగడం వల్ల అనర్ధాలను తెలియజెప్పారు. 
                 వీలైనంత వరకు వారి సమయాన్ని గ్రామ వికాసం కోసమే వెచ్చించే వారు. చాయ్ హోటల్ లో కలసినా, దొరగారి గద్దె కాడ గల్సినా , హన్మాండ్ల గుళ్ళో  కలసినా, వారి మాటా ముచ్చటా ఊరు సంక్షేమమే ! అంతే గాక ప్రతీ శనివారం హనుమాండ్ల గుళ్ళో భజన  కార్యక్రమం తో ఊరు ఊరంతా కలిసే వాళ్ళు . గంగుల రాజ గంగారాం, తులసిదాస్ లాంటి వాళ్ళు  వారి గానంతో తన్మయుల్ని చేసేవారు. అక్కడ భజన అనంతరం మళ్లీ గ్రామ సమస్యల్ని చర్చించేవాళ్ళు .
                  అలా వాళ్ళు మన గ్రామంలో హనుమాండ్ల గుడి సుట్టు ప్రహారి గోడ నిర్మంచిడం, ప్రస్తుతం ఊర్లో ఉన్న గాంధీ, నెహ్రు, శాస్త్రి విగ్రహాలను నిలబెట్టడం , దొరగారి యాప కింద గద్దె నిర్మాణం , బీమన్న జాతర ప్రతీ యాడాది  కార్యక్రమం , ఇలా అనేక పనులు చేశారు. అంతే గాక మన బడి గురించి వాళ్ళు చాలానే కష్టపడ్డారు. ఆ రోజుల్లో ఏడో తరగతి చేయడానికి DEO స్థాయిలో పలు మార్లు ప్రయత్నాలు జరిపి 1982  లో సాధించారు. ఆ సంవత్సరం నుండి మన బళ్ళో ఏడవ తరగతి  ప్రారంభమయ్యింది.
                ఆట పాట అనేది మన ఊరి చిరునామా గా మారింది. సాయంత్రం కాగానే బ్యాట్మింటన్ కోర్ట్ లో గ్రామ పెద్దలంతా కలిసే వాళ్ళు గంటల కొద్ది ఆడుతూనే వుండేవారు. అప్పుడు మేమంతా ఆటని చూస్తూ ఎంతో ఆనందించేవాళ్ళం. వాళ్ళది ఆడడం కాగానే పిల్లల మంతా ఆడే వాళ్ళం. అలా ఒకాటి గాదు వాలీ బాల్, కబాడీ లాంటివి ఎన్నో ఆడేవారు. అనంతరం వారి తరువాతి తరంగా మేమూ ఆ ఆటల్ని  కొనసాగించాం.
                కాల క్రమంలో వాళ్ళ సంతానం ను కూడా గ్రామ వికాసం లో జోడించడం తో సహజంగానే వారి వారసత్వంగా వారి పిల్లలు కూడా గ్రామ వికాసం పై దృష్టి సారించారు. ఎన్నో సేవా కార్యక్రమాలకు రూప కల్పనా చేసారు. అలా మా పెద్ద వాళ్ళు చూపిన దారి గ్రామ వికాసం దృష్ట్యా  నవతరం యువకులతో " నవశాస్త్రి యువజన సంఘం " ప్రారంభించడానికి బీజం వేసింది. 
             ఆ క్రమం లోనే 26-1-1993 రోజున మన గ్రామం లో నవశాస్త్రి యువజన సంఘం ప్రారంభమయ్యింది. 


నవ శాస్త్రి యువజన సంఘ ప్రారంభ కార్యక్రమం :  తేది : 26 జనవరి  1993  
             

ఆనాటి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని సంఘ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మన స్వర్గీయ సర్పంచ్  శ్రీ చెట్లపెల్లి  చిన్న నర్సా గౌడ్ గారు.



కార్యాలయ ప్రారంభ అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్న అప్పటి మన ఉప సర్పంచ్ స్వర్గీయ లింగాల రాజన్న గారు. 



కార్యక్రమ ప్రారంభానికి ముందు జ్యోతి ప్రజ్వలన గావిస్తున్న మన గ్రామ  ఆర్ ఏం పి  వైద్యులు శ్రీ చక్రపాణి గారు. 



కార్యక్రమానికి వ్యాఖ్యాత గా వ్యవహరిస్తూ స్వాగత ప్రసంగం చేస్తున్న వారు శ్రీ పెరంబుదూరి లిమ్బగిరి గారు. 




వేదిక పైన ఆసీనులై న పెద్దలు వరుసగా ఆ చివర నుండి : శ్రీ అంకతి పెద్ద రాజన్న గారు, మోతుకూరి రాజగౌడ్ గారు, స్వర్గీయ శ్రీ పెరంబుదూరి విద్యాసాగర్ గారు, స్వర్గీయ లింగాల రాజన్న గారు, శ్రీ చక్రపాణి గారు, స్వర్గీయ  శ్రీ చిన్న నర్సాగౌడ్ గారు, శ్రీ చెట్ల పెల్లి నర్సా గౌడ్ గారు , శ్రీ శంకరయ్య హెచ్ . ఎమ్. గారు, శ్రీ ఏలేటి నర్సయ్య ( కుంటన్న ) గారు , స్వర్గీయ శ్రీ రామారావు బాపు గారు, స్వర్గీయ శ్రీ రాజారెడ్డి పట్వారి నడికుడ గారు, శ్రీ కాంతయ్య సారు వి.ఆర్.వో గారు.


వ్యవస్థాపక కార్యవర్గం : ( ఎన్నిక తేది : 4-2-1993  గురువారం )


అధ్యక్షులు :              శ్రీ బాలి రవీందర్  గారు
ఉపాధ్యక్షులు:           శ్రీ జంగ గంగాధర్ గారు 
ప్రధాన కార్యదర్శి :    శ్రీ గోల్కొండ నాగరాజు గారు
కార్యదర్శి  :              శ్రీ కదకుంట్ల రామదాసు గారు 
కోశాధికారి :             శ్రీ షేక్ ఇమాం గారు


సంఘ సభ్యులు :     ( తేది: 30-12-1995  నాటికి )
  1. శ్రీ బాలి రవీందర్
  2. శ్రీ  గోల్కొండ నాగరాజు
  3. శ్రీ  పెరంబుదూరి మురళిధర స్వామి 
  4. శ్రీ అంకతి లింగారెడ్డి
  5. శ్రీ గొల్లవత్తిని శ్రీనివాస్ 
  6. శ్రీ గొల్లవత్తిని నర్సింలు
  7. శ్రీ ఇల్లెందుల శ్రీనివాస్ 
  8. శ్రీ బొల్లి రమేష్
  9. శ్రీ మామిడాల చంద్ర శేకర్
  10. శ్రీ సాన ఆశన్న 
  11. శ్రీ వనతడుపుల రమేష్
  12. శ్రీ బావు నర్సయ్య 
  13. శ్రీ MD. మహమూద్ ఖాన్
  14. శ్రీ మామిడి గంగాధర్
  15. శ్రీ జంగ గంగాధర్ 
  16. శ్రీ బాలి రాజేందేర్ 
  17. శ్రీ  పెరంబుదూరి లింబగిరి  స్వామి
  18. శ్రీ  షేక్ ఇమామ్ 
  19. శ్రీ లక్ష్మణ్ జాన్
  20. శ్రీ కడకుంట్ల సత్యనారాయణ
  21. శ్రీ పౌరాజుల ప్రసాద్
  22. శ్రీ హైమత్ ఖాన్
  23. శ్రీ  కడకుంట్ల నర్సింలు
  24. శ్రీ సామ శ్రీనివాస్
  25. స్వర్గీయ శ్రీ వేయిగండ్ల భాస్కర్
సంఘం  రిజిస్టర్ అయిన తేది : 29-12-1993  సంఖ్య: 5689/93

సంఘ  వికాసం - అభివృద్ధి కార్యక్రమాలు : 

                                1996  నాటికి అనగా స్థాపించిన మూడు సంవత్సరాల్లోనే  భారత ప్రభుత్వ యువజనుల వేదిక ఐనటువంటి " నెహ్రూ  యువక కేంద్రం - కరీంనగర్" లో సభ్యత్వాన్ని సాధించి కేంద్ర  సమన్వయము  తో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆనాటి కలెక్టర్ శ్రీ బి.యార్. మీనా గారి సహకారం మరువలేనిది. అక్షర ఉజ్వల పేరు తో అక్షరాస్యతా కార్యక్రమం విశేషమైనది.
                                ప్రతీ నూతన  సంవత్సరం  గ్రామం లో ప్రముఖులకు ప్రజలకు గ్రామ వికాసం కాంక్షిస్తూ శుభ పత్రికలను పంచడం సంఘ ఆనవాయితీ....మచ్చుకు ఒక పత్రిక .



నిత్యం ఆటలతో అదీ గ్రామ పెద్దలతో కలసి ఆడడం ఒక గొప్ప అనుభవం  !
                                              ఊర్లో ఏ సాయంత్రం ఖాళీ గా వుండేది కాదు. అలా గ్రామ సర్పంచ్ ఇతర పెద్దలు మైదానం కు వచ్చేవారు వెంటానే వాలీ బాల్ గేమ్ మొదలయ్యేది అలా మాతో కలిసి ఆడి పాడిన వాళ్ళలో శ్రీ స్వర్గీయ చెట్లపెల్లి నర్సాగౌడ్ గారు, పెద్ద నర్సా గౌడ్ గారు, చక్రపాణి గారు, గొల్లవత్తిని శ్రీనివాస్,ద్యవతి మల్లయ్య,గొల్లవత్తిని శ్రీనివాస్ లు మొదలగు  వారున్నారు. 

వాలీ బాల్ 

 
బాల్ లావడ్తున్న స్వర్గీయ సర్పంచ్ గారు చిన్న నర్సాగౌడ్ గారు - వారి తో పాటే పెద్ద నర్సాగౌడ్ గారు వున్నారు.


సర్విసింగ్ లో గంగాధర్ ఆట లో గ్రామ యువకులు బిజీ 


అంపైరింగ్ లో బాలి రాజేందర్ బిజీ 

క్రికెట్ 


బౌలింగ్ చేస్తున్న ఉపసర్పంచ్ స్వర్గీయ లింగాల చిన్న రాజన్న ,అంపైర్ గా ఇమామ్ భాయ్ ,కెమరా తో ద్యావతి గంగాధర్  ఇంకా గ్రామస్తులు సంఘ సభ్యులు ...

బ్యాటింగ్ లో స్వర్గీయ చిన్న నర్సాగౌడ్ గారు, కీపింగ్ లో చక్రపాణి, కెమరా తో రవీందర్ బాలి ఆట షురూ ...

పెద్దనర్సయ్య గారి బ్యాటింగ్ కాస్కో...

తొలి సంఘ భవనం - ప్రస్తుతం రఫీ వాళ్ళ కిరణం షాప్ 

గ్రామం లో మొక్కలు  నాటే కార్యక్రమం :

మొక్కలతో సంఘ సభ్యులు 

మొక్కలు నాటుతున్న ద్యావతి మల్లయ్య , సాన ఆసన్న, మురళీధర్ స్వామి, నరేష్, ఇతరులు 
గోదావరి బండి రేవుకు మొక్కలు నాటే కార్యక్రమం :

బండి రేవుకు మొక్కలు నాటుతున్న రాజేందేర్, రామదాస్, వనతడుపుల రమేష్, ద్యావతి మల్లయ్య 

గంగ ఒడ్డుకు మొక్కలు నాటుతున్న నాగరాజు, లింగారెడ్డి,గంగాధర్, రాజేందేర్,రవీందర్, సాన ఆసన్న, ఔసుల శీను  ఇతరులు 

గోదావరి కీ పోయే బండిరేవు రోడ్డు కు శ్రమదాన కార్యక్రమం : 
                                        సుమారు సంవత్సరం పాటు అనేక సందర్భాల్లో గోదావరి బండిరేవు రోడ్డు బాగు కోసం శ్రమ దాన కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. ఎన్నో పెద్ద పెద్ద బొందాలతో ఏ వాహనం సరిగ్గా పోలేని స్థితి లో వుండేది. కచ్రాలు గట్టుకుని గంగాలకేల్లి పెద్ద పెద్ద గుండ్లు నింపి  పూరించడం జరిగింది. 
                                      అనంతరం పలు మార్లు అధికార్లతో విన్నవించిన కారణంగా ఈ రోజు అంత మంచి రోడ్డు మనకు అందుబాటులోనికి వచ్చింది.

21-1-1994 రోజున పలుగు పార తట్టలతో పెద్ద ఎత్తున శ్రమదానం లో సంఘ సభ్యులు 

ఆ తెల్లవారే ఈనాడు లో వచ్చిన వార్త .

దీనికి ముందు 22-11-1993 లో మరో వార్త.

మన  బడి కోసం:
                           ఆ రోజుల్లో ప్రాథమికోన్నత వరకు ఉన్న మన స్కూల్లో ముగ్గురే సార్లు వుండేవారు.సార్ల నియామకం కోసం కలెక్టర్. డి.ఇ.ఓ, స్థాయిల్లో వినతిపత్రాలు ఇచ్చి ఇచ్చి ఏ పని కాకపోయేసరికి ఆదర్శ యువజన సంఘం వారితో కలిపి రిలే నిరాహార దీక్షలకు నోటీస్ ఇచ్చాం...
      
2-10-1993  రోజున నోటీస్ వార్త. 
అనంతరం బోధనా అనుభవం ఉన్న సంఘ సభ్యులమే వెళ్లి స్కూల్లో తరగతులు నిర్వహించాం. 

ప్రతీ అక్టోబర్ 2  న క్షీరాభిషేకం :
                                   ప్రతీ అక్టోబర్ రెండు న గాంధీ మరియు శాస్త్రి ల జయంతులను పురస్కరించుకుని గ్రామం లో ఉన్న ఆ రెండు విగ్రహాలకు నీటి తో కడిగాక  పాలతో అభిషేకం చేసి వారి జయంతి కార్యక్రమాల్ని నిర్వహించేవాళ్ళం. గ్రామ పెద్దలు ప్రముఖులు హాజరయ్యే వారు. 

ప్రతీ శుక్రవారం గోదావరి బండి రేవు కు బృందాల వారిగా వెళ్లి రోడ్డు బాగు కోసం విరాళాల సేకరణ :
                               ప్రతీ  శుక్రవారం వారినికి ఒక టీం చొప్పున బండి రేవు కు వెళ్లి జమ చేసిన డబ్బు ను రోడ్డు బాగు కోసం వుపయోగించేవాళ్ళం. ఎవరైనా వెళ్లక పొతే సంఘ మాసవారి సమావేశం లో క్రమశిక్షణా చర్యలు ఉండేవి.

ప్రతీ పండుగు రోజు ఏదో ఒక సేవాకార్యక్రమం చేయడం :
                             పండుగ వచ్చిందంటే చాలు ఆ రోజు అందరికి సెలవు వుండడం తో గ్రామం లో పరిశుబ్రత, దేవాలయ శుబ్రత, బడి శుబ్రత , శ్రమదానం కార్యక్రమాలు చేసేవాళ్ళం. భవిష్యత్ కార్యక్రమాల్ల్ని ఆలోచిన్చేవాళ్ళం. 

వైభవంగా వినాయక నవరాత్రులు - రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు :
                                                          దొరవారి గద్దె పైన మూడు సంవత్సరాలు వరుసగా నిర్వహించిన వినాయక నవరాత్రులు మన గ్రామం లో చెరగని ముద్రవేశాయి. నియమ నిష్ట ల తో  తొమ్మిది రోజులు కొనసాగించిన సాగించిన ఉత్సవాలు అద్భుతం. ప్రతీ రోజు ఆటవిడుపుగా రాత్రి వివిధ సామాజిక అంశాలు, హాస్యం జోడించి నాటికల ప్రదర్శన వుండేది. 


మొదటి సంవత్సరం గణపతి.

క్లోస్ అప్ మొదటి సంవత్సరం గణపతి 

రండవ సంవత్సరం గణపతి - పూజా  కార్యక్రమంలో రాజేందేర్    
మూడవ సంవత్సరం గణపతి తో మురళీధర్ స్వామి 

నవరాత్రి  ఉత్సవాల్లో నాటికల దృశ్యాలు: 


పంచాయతి నాటికలో నాగరాజు,రవీందర్, సాన ఆసన్న, ద్యావతి మల్లయ్య, బొచ్చు నర్సయ్య, ఎస్.పి. లిమ్బగిరి స్వామి.

తాగుబోతు నాటికలో నాగరాజు , రాజేంధర్ బాలి 

పెల్లి తంతు నాటికలో వరుసగా ఔసుల శీను, నాగరాజు, లింగారెడ్డి,  వేయిగండ్ల భాస్కేర్,  వనతడుపుల రమేష్, రవీందర్, మామిడాల శేకర్, ద్యావతి గంగాధర్-తుపాకిరామడు,  పూజారి మురళి, పిల్ల- మైబెల్లి, పిలగాడు-రాజెందేర్  

ఊర్లో మద్యం నిషేధించాలని గ్రామ సభ లో చర్చ - తీవ్ర ఉద్రిక్తత  :

                                              గ్రామం లో మద్యం నిషేదించాలని గ్రామ పంచాయతి వద్ద గ్రామ సర్పంచ్, ప్రముఖులు-ప్రజలతో ఒక చర్చ జరిగింది. గుడుంబా లాంటి ప్రమాదకర కల్లును  తయారు చేయడం మానాలని మాట్లాడం. తలా ఓ రీతి లో స్పందించడం తో నేరుగా అమ్మేవారు, తయారి దార్ల  అడ్డా ల పై కీ వెళ్ళాల్సి వచ్చింది. ఆ సందర్భంలో ని సన్నివేశాలు......
 
గ్రామ సభ 

ప్రస్తుత గ్రామ ప్రముఖులు నాడు వరుసగా మంద రాజారెడ్డి, మోహన్రెడ్డి, మాసుల చిన్నరాజన్న , మొదలగువారు.




1994 - అక్టోబర్ మాసంలో తీవ్ర ఉద్రిక్తల నడుమ జరిగిన గ్రామ సభ మరియు నాటి పత్రిక ల వార్తలు.

                   ప్రజల సహకారం తో కొద్ది రోజులు మాత్రమే కల్లు అడ్డా లను నిలిపి వేయగాలిగాం. ఇప్పటికి ఎంతో మంది కుటుంబాలు కేవలం కల్లు అలవాటు తోనే సర్వనాశనం అవుతున్నాయి. వ్యక్తుల్లో మార్పు రానంత వరకు ఏ సమాజం మారదు. అలా వ్యక్తి వ్యక్తి లో మార్పును సాధించి అద్భుత పురోగతి లో దూసుకు పోతున్న రాలెగావ్ సిద్ది లాంటి, చిత్రకూట్ లోని ఐదు వందల గ్రామాల్ని మనమిప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. 

ముగింపు:
                               సుమారు ఏడెనిమిది సంవత్సరాలు గ్రామ వికాసం కోసం నిరంతరం తపించిన సంఘం గా అనేక కార్యక్రమాల్ని అనేక రూపాల్లో నిర్వహించి చూపాం. గ్రామ ప్రజల చేత శెభాష్ అనిపించుకున్న రీతిలో అందరిని కదిలించాం. ఇప్పటికీ ఈ తరం యువజన సంఘాలు అనేకం మా కార్యక్రమాల స్పూర్తిని తీసుకుని పనిలో వుండడం మాకు ఆనందం కలిగించేవిషయమే ! 
                            మన స్వంత గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని మేము నిర్వహించిన అనేక కార్యక్రమాలు మా బావి జీవితం లో ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ అనుభవం మా మీద ఎంతో ప్రభావాన్ని చూపింది. ఇప్పటికి ఏ కార్యక్రమాలు చేసినా అప్పటి కార్యక్రమాల నమూనానే తీసుకుంటాం. 
                            కాలం క్రమంలో ఎవరం ఎక్కడా వున్నా ఓ వైపు మా ఊరి గురించి ఆలోచిస్తూనే వుంటాం...!
                            ఈ మధ్యే మా మిత్రుల సమావేశం లో ఏదైనా ఒక మంచి ధీర్గకాలిక సేవా కార్యక్రమం ఒకటి గ్రామం లో ప్రారంభించాలని అనుకున్నాం. త్వరలోనే మా పల్లె ఋణం తీర్చుకునేందుకు కదలి వెళ్తాం. 
                           మిత్రిలారా.........! ఉన్న ఊరు కన్న తాల్లి లాంటిది మనం ఎక్కడెక్కడున్నా మన ఊరి కోసం సేవ చేస్తూనే ఉందాం.
            గట జ్ఞాపకాలతో......... మళ్లీ ప్రేరణ పొందుదామనే తలంపు తో ముగిస్తూ మీ నాగరాజు గోల్కొండ.
                                      ...... సమాప్తం .....






                          




    Comments

    Popular posts from this blog

    బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

    సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

    పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.