స్వర్గీయ శ్రీ పెరంబుదూరి విద్యాసాగర్ : శ్రీ పెరంబుదూరి విద్యాసాగర్ గారికి జన్మతః సహజాతంగానే రచన, గానం, నటన వచ్చినాయనిపిస్తుంది. వారి వాచకం బాషణం లో ఉట్టిపడే పద విన్యాసం ఎదుటివారిని అలా కట్టి పడేసేవి. ఊర్లో ఆ రోజుల్లో సాగరన్న అంటే తనకు తెలంది లేదు అని జనం చెప్పుకునేవారు. తను ఒక పద్యం, ఒక పాట, ఒక శ్లోకం పాడితే జనమంతా మంత్ర ముగ్దులై వింటూ ఉండేవారు . గ్రామం లో ఎందరో మలి తరం యువకులకు వారి స్పూర్తి గా నిలిచారు. దేశ దేశాల్లో సాగిన వారి జీవన యానం వారిని ఇంకా పరిపక్వం లోకి తెచ్చింది. వారు మస్కట్ లున్న, బొంబాయ్ లున్న ఈ ఊరి మననం చేయనిదే ఉండలేదు. తను మస్కట్ కెళ్ళి ఆడియో క్యాసెట్ నింపి పంపితే వాడంతా వాళ్ళింట్లో వాలి కొన్ని రోజులు వినేవారు. ఆ క్యాసెట్ లో వారు కేవలం ఊరి ఇంటి బాగోగులే గాక అనేక జానపద మాండలీక భాగవత గాధల్ని పాడి పంపేవారు. అదొక పల్లె ఆల్బం గా చెప్పుకోవచ్చు. ...